సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని మండిపడ్డారు.
మరో ట్వీట్‌లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్‌లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడని విమర్శించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అతని ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎవరేంటి అనేది ప్రజలకు తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు.