అనంతపురం : మహిళలు ఆదర్శవంతమైన భావంతో మెలిగినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా 94వ జయంతి ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సత్యసాయి బాబాకు తాను ఎప్పటి నుంచో భక్తురాలినని చెప్పారు. తమిళనాడులోని సుందరంలోని సత్యసాయి మందిరాన్ని నిత్యం సందర్శించుకునేవారమని చెప్పారు. ప్రతి గురువారం సుందరం వెళ్లనిదే రోజు గడిచేదికాదని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. నేటితరంలో మహిళలు రాజకీయాల్లో రాణించడం కష్టంగా మారిందని.. తనకు భాజపా మంచి అవకాశం కల్పించిందని తమిళిసై చెప్పారు. తాను వైద్యురాలిగా, రాజకీయాల్లో సేవలందించడం ఆనందంగా ఉందని చెప్పారు. దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా అన్ని విభాగాలతో పాటు బిల్లు కట్టే విభాగం కూడా ఉంటుందని.. కాని సత్యసాయి ఆసుపత్రుల్లో అలాంటి విభాగం కనిపించలేదని ఆనందం వ్యక్తం చేశారు. సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. బాబా చేసిన ఆధ్యాత్మిక బోధనలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. కార్యక్రమానికి హాంకాంగ్ భక్తురాలు విషభల ఘాతోపాటు వివిధ దేశాల నుంచి మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకురాలు శోభన స్వామినాథన్ బృందం నిర్వహించిన కచేరి అందరినీ ఆకట్టుకుంది.
ఆదర్శవంతమైన భావంతో.. మహిళలు మెలగాలి