సమ్మె కొనసాగుతుంది: జేఏసీ


విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు: జేఏసీ హైదరాబాద్‌: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్‌ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.